ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జనవరి 18










ఎన్టీఆర్, వైయస్సార్ స్ఫూర్తితో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు…. సీఎం రేవంత్ రెడ్డి
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లిలో ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్
ఏదులాపురం, జనవరి 18:
ఎన్టీఆర్, వైయస్సార్ స్ఫూర్తితో పేదలకు సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు వాకాటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావులతో కలిసి పర్యటించి మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజలు తనకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్లు శాశ్వతంగా నిలిచి పోతాయని తెలిపారు. గతంలో తెలుగు వారు అంటే మద్రాసీలు అనే పేరు ఉండేదని, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ వేదిక నుంచి వారికి నివాళులు అర్పిస్తున్నామని అన్నారు.
పేదలు కడుపు నిండా అన్నం తినాలని ఉద్దేశ్యంతో ఆ రోజులలో రెండు రూపాయ లకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టారని, మన రాష్ట్ర ప్రభుత్వం నేడు మూడు కోట్ల 17 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా సరఫరా చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన నిరు పేదలందరికీ నూతన రేషన్ కార్డులు జారీ చేశామని, ఇంకా ఎవరైనా రేషన్ కార్డు లేని అర్హులు ఉంటే వెంటనే మంజూరు చేస్తామని అన్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత కరెంటుపై మొదటి సంతకం చేయడమే కాకుండా 1300 కోట్ల విద్యుత్ బకాయిలు రద్దుచేసి, వేలాది మంది రైతులపై ఉన్న కేసులను తొలగించిన మహానుభావుడు వైఎస్ఆర్ అని అన్నారు. ఆయన స్ఫూర్తితో నేడు 24 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు పేదలకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ 52 లక్షల పేదల కుటుంబాలకు, 30 లక్షల పంపు సెట్ లకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలని గతంలో వైయస్సార్ 25 లక్షల ఇండ్లు నిర్మిస్తే, గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట మోసం చేశారని సీఎం విమర్శించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి భద్రాచలంలో శ్రీరామ చంద్రమూర్తి సాక్షిగా ప్రవేశ పెట్టామని అన్నారు. ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఖమ్మం జిల్లాలో ప్రారంభించామని అన్నారు. ఏప్రిల్ నెల తర్వాత పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలకు రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు.
*డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అవసరమైన అన్ని పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో చేపట్టామని అన్నారు. ఇరిగేషన్ కు సంబంధించిన మున్నేరు పాలేరు లింకు, ఎడ్యుకేషన్ సంబంధించి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం, హెల్త్ కు సంబంధించి కూసుమంచిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే విధంగా అవసరమైన పరిశ్రమలను కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకొని రావలసిన అవసరం ఉందని అన్నారు. జిల్లాకు పరిశ్రమల పార్కు ప్రత్యేకంగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కోరారు.
*నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 50 నుంచి 60 టీఎంసీల మున్నేరు నది జలాలు వృధాగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయని, ముల్కనూర్ గ్రామం వద్ద చెక్ డ్యాం నుంచి 9.6 కిలో మీటర్ల గ్రావీటి కాల్వ ద్వారా మున్నేరు పాలేరు లింక్ కేనాల్ పనులకు ప్రభుత్వం 162 కోట్లతో చేపట్టామని, ఈ ప్రాజెక్టు ద్వారా 2 మెగా వాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి, లక్షా 50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అన్నారు.
గత పాలకుల పాలనలో సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి ఒక ఎకరం కూడా భూ సేకరణ చేయలేదని విమర్శించారు. గోదావరి నది జలాల ద్వారా ఖమ్మం జిల్లాలో ఆరు లక్షల 80 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు వేగవంతం చేశామని అన్నారు. 4వ పంప్ హౌస్ పనులు వేగవంతం అవుతున్నాయని అన్నారు.
ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతారామ ఎత్తిపోతల పథకానికి 67 టిఎంసిల నీటి కేటాయింపు చేయడం జరిగిందని అన్నారు. మున్నేరు పాలేరు నది లింక్ కేనాల్ ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 120 కోట్ల విద్యుత్ ఆదా అవుతుందని అన్నారు. మున్నేరు పాలేరు లింక్ కాల్వ పనులు సంవత్సరంలోగా పూర్తి చేసి ప్రారంభిస్తామని అన్నారు.
*జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు వాకాటి శ్రీహరి మాట్లాడుతూ అతి తక్కువఖర్చుతో లక్ష యాభై వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మున్నేరు పాలేరు లింకు పనులను ప్రజా ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. పేద ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు పంచాయతీ ఎన్నికలలో ఆమోదం తెలిపిన విధంగానే రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
*వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించాలనేదే తన లక్ష్యమని చెప్పారు. సీతారామ ఎత్తిపోత్తల పథకం సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిందని, కాల్వల నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్నామని, భవిష్యత్తులో కృష్ణ జలాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ నాగార్జున సాగర్ 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం గోదావరి జలాలను వినియోగిస్తామని అన్నారు. మంచినీటికి, సాగునీటికి ఇబ్బందులు పడుతూ కరువుతో తల్లాడిన పాలేరు నియోజకవర్గంలో భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి పసిడి పంటలు, పామాయిల్ హబ్ గా తీర్చిదిద్దామని అన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రైతులు వాణిజ్య పంటలు పండించి ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. అన్ని గిరిజన తండాలకు రహదారులు వేసే అవకాశం, నాలుగు మండలాలకు జాతీయ రహదారులు తీసుకొచ్చే అవకాశం తనకు కలిగిందని తెలిపారు.
*రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ బంగాళాఖాతంలో వృథాగా కలిసే మున్నేరు నది జలాలను 9.6 కిలో మీటర్ల మేర త్రవ్వి గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్ లో కలిపేందుకు 162 కోట్లతో చేపట్టిన మున్నేరు పాలేరు లింక్ కెనాల్ పనులకు నేడు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని, దీని ద్వారా నాగార్జున సాగర్ క్రింద ఉన్న లక్షా 50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అన్నారు. గ్రామ పంచాయతీ ఫలితాలు అద్భుతంగా వచ్చాయని, అదే విధంగా ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కు జరగబోయే ఎన్నికలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
