రెవెన్యూ ‘ఐక్యత’కు కలెక్టర్ ప్రశంస

  • ఏకగ్రీవ ఎన్నిక ఉద్యోగుల మధ్య సమన్వయానికి నిదర్శనమని హర్షం

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు డిసెంబర్ 22

జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్నికల్లో చోటుచేసుకున్న ఏకగ్రీవ ఫలితాలు ఉద్యోగుల మధ్య ఉన్న బలమైన ఐక్యతకు, పరస్పర సమన్వయానికి నిదర్శనమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రశంసించారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా యూనిట్‌తో పాటు ఖమ్మం, కల్లూరు సబ్ డివిజన్‌లు, కలెక్టరేట్ యూనిట్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నూతన పాలకవర్గ సభ్యులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల పోటీ లేకుండా ఉద్యోగులందరూ ఏకాభిప్రాయంతో కార్యవర్గాన్ని ఎన్నుకోవడం రెవెన్యూ ఉద్యోగుల్లో ఉన్న అత్యున్నత స్థాయి ఐక్యతను స్పష్టంగా చాటుతోందన్నారు. ఇదే సమన్వయాన్ని విధుల్లోనూ కొనసాగిస్తూ జిల్లాలో రెవెన్యూ సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని సూచించారు. రెవెన్యూ అనేది కేవలం ఒక శాఖ మాత్రమే కాదు. ప్రభుత్వ పరిపాలన మొత్తం సజావుగా కొనసాగించబడేది రెవెన్యూ వ్యవస్థ ద్వారానే అన్నారు. ఇది ఎంతో ఒత్తిడితో కూడుకున్న వ్యవస్థ అని అలాంటి విభాగంలో పనిచేసే ఉద్యోగుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉద్యోగులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ అంశంపై సంఘ బాధ్యులు చేసిన విజ్ఞప్తికి కలెక్టర్ వెంటనే సానుకూలంగా స్పందించారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన సిబ్బందికి రెవెన్యూ అంశాలపై సంపూర్ణ అవగాహన, ప్రాయోగిక శిక్షణ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనివల్ల ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులు, ఇటీవల జిల్లా కలెక్టర్‌కు వచ్చిన “బిట్స్ పిలానీ” ప్రతిష్ఠాత్మక అవార్డుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పద్మశ్రీలను కలిశారు. ఐక్యతతో నూతన బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులందరికీ వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కారుమంచి శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారి బి.వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు తుంబూరు సునీల్ రెడ్డి, కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, ట్రెజరర్ క్రాంతి కుమార్, గౌరవ అధ్యక్షులు రవీందర్, ముజాహిద్, సాయి నరేష్, ఖమ్మం డివిజన్ అధ్యక్షులు సీహెచ్. సురేష్, కార్యదర్శి ఎం. శ్రీనివాస్, కల్లూరు డివిజన్ అధ్యక్షులు టి. కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి డి. కరుణశ్రీ, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు పి. రాజేష్, కార్యదర్శి బి. రవి, ఇతర సంఘ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు
తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA)
ఖమ్మం జిల్లా

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed